Breaking News

నాగేశ్వర జ్యోతిర్లింగం

దారుకయను పేరుగల ఒకానొక ప్రసిద్ధమైన రాక్షసియుండెను. పార్వతియొక్క వరదానమున ఆమె సదా గర్వముతో నిండియుండెను. అత్యంత బలవంతుడగు దారుకుడను రాక్షసుడు ఆమె భర్తమ్. అతడు అనేకమంది రాక్షసులను వెంటబెట్టుకొని సత్పురుషులని సంహరించుచుండెను. అతడు ప్రజల యజ్ఞములను, ధర్మమును నాశనమొనర్చుచు తిరుగుచుండెను. పశ్చిమ సముద్రతీరమున ఒక వనము ఉండెను. అది సకల సమృద్ధులతో నిండియుండెను. అన్నివైపులనుండి దాని విస్తారము పదహారు యోజనములు. దారుక విలాసముగ వెళ్ళెడి ప్రతిచోటికి ఆ భూమి, వృక్షములు, మిగతా ఉపకరణములన్నిటితో కూడిన ఆ వనము కూడా వెళ్ళుచుండెను. పార్వతీ దేవి ఆ వన సంరక్షణ భారమును దారుకునకు అప్పగించెను. దారుక తన భర్తతో కూడి తన భర్తతో కూడి ఇష్టము వచ్చినట్లు వనమునందు విహరించుచుండెను. రాక్షసుడగు దారుకుడు తన పత్నితో అచటినుండి అందరిని భయపెట్టుచుండెను. అతనిచే పీడితులైన ప్రజలు ఔర్వక మహర్షిని ఆశ్రయించిరి. ఆయనకు తమ దుఃఖమును వినిపించిరి. ఔర్వుడు శరణాగతులను రక్షించుటకు రాక్షసులనిట్లు శపించెను. - "ఈ రాక్షసులు భూమిమీదనున్న ప్రాణులను హింసించినను, లేక యజ్ఞములను ధ్వంసము చేసినను అదే సమయమున తమ ప్రాణములను పోగొట్టుకొందురు." దేవతలు ఈ విషయములను వినిరి. వారు దురాచారులగు రక్షసులమీద దాడి చేసిరి. రాక్షసులు వ్యాకులతకు లోనైరి. వారు యుద్ధమునందు దేవతలను సంహరించినచో మునియొక్క శాపమున స్వయముగ చనిపోయెదరు. ఒకవేళ చంపకపోయినచో పరాజితులై ఆకలితో చనిపోవుదురు. ఈ స్థితిలో రాక్షసియగు దారుక "భవాని వరదానము చేత నేను ఈ వనమునందు కోరినచోటికి వెళ్ళుదును". ఇట్లు పలికి ఆ సమస్త వనమును ఉన్నదున్నట్లు తీసుకొనిపోయి సముద్రమునందు ఆ రాక్షసి నివసించెను. రాక్షసులు భూమిమీద ఉండకుండ నీటిలో నిర్భయముగ నివసింపసాగిరి. అచటి ప్రాణులను పీడింపసాగిరి. ఓడలలో వర్తకానికై వచ్చే వారిని కొల్లగొడుతూ, వారిని చెరాలలో వేస్తూ వుంటుంది.
ఆ రాక్షసులు ఒకసారి సుప్రియుడనే వైశ్య శివభక్తుని బంధించి హింసిస్తూ వుంటారు. అతడు మిగుల ప్రేమతో శివుని చింతన చేయుచు ఆ స్వామి నామములు జపించసాగెను. సుప్రియుడిట్లు ప్రార్థించగా భగవంతుడగు శంకరుడు ఒక బిలమునుండి బైటికి వచ్చెను. ఆ స్వామి వెంట నాలుగు ద్వారములు గల ఒక ఉత్తమ మందిరము కూడ ప్రకటితమయ్యెను. దాని మధ్యభాగమున అద్భుతమైన జ్యోతిర్మయ శివలింగము ప్రకాశించుచుండెను. సుప్రియుడు దానిని దర్శించి పూజించెను. పూజితుడైన భగవంతుడగు శంభుడు ప్రసన్నుడయ్యెను. స్వయముగ పాశుపతాస్త్రమును చేపట్టి ప్రముఖులైన రాక్షసులను, వారి సమస్త ఉపకరణములను, సేవకులను కూడా అప్పటికప్పుడు నశింపజేసెను. దుష్టులను సంహరించు శంకరుడు తన భక్తుడగు సుప్రియుని కాపాడెను. లీలా శరీరధారియైన శంభుడు ఆ వనమునకు ఒక వరమునిచ్చెను. నేటినుండి ఈ వనమునందు సదా బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్య, శూద్రుల ధర్మములు పాలించబడుగాక! ఇచట శ్రేష్ఠులైన మునులు నివసించెదరు. తమోగుణయుక్తులగు రాక్షసులు ఇక ఎప్పుడును ఇచట ఉండలేరు. శివధర్మ ఉపదేశకులు, ప్రచారకులు, ప్రవర్తక్లు ఈ వనమునందు నివసించెదరు గాక!
అప్పుడు రాక్షసియగు దారుక దీన చిత్తముతో పార్వతీదేవిని స్తుతించెను. ఆ దేవి ప్రసన్నురాలై "నీకార్యమేమిటో తెలుపుము" అని పలికెని. "నా వంశమును రక్షింపుము" అని రాక్షసి పలికెను. "నేను సత్యమును చెప్పుచున్నాను. నీకులమును రక్షించెదను" అని దేవి నుడివెను. ఆ దేవి భగవంతుడగు శివునితో ఇట్లు నుడివెను. "నాథా! మీ ఈ వచనము యుగాంతమునందు సత్యమగును. అప్పటివరకు తామసికమైన సృష్టికూడ ఉండును. నేను కూడా మీ దాననే. మీ ఆశ్రయముననే బ్రతుకుచున్నాను. కనుక నా మాటను కూడా సత్యము చేయుము. ఈ రాక్షసి దారుకాదేవి నాశక్తియే. కనుక ఈ రాక్షస రాజ్యము ఆమెయే పాలించవలెను. ఇది నా కోరిక.
అప్పుడు శివుడు "ప్రియురాలా! నీవిట్లు పలికినచో నా వచనమును వినుము. నేను భక్తులను పాలించుటకు సంతోషముతో ఈ వనమున నివసించెదను. వర్ణధర్మ పాలనయందు తత్పురుషుడైన పురుషుడు భక్తిశ్రద్ధలతో నన్ను దర్శించును. అట్టివాడు చక్రవర్తియగును. కలిుగాంతమున సత్యయుగ ఆరంభమునందు మహాసేనుని పుత్రుడు వీరసేనుడు రాజులకు రాజగును. అతడు నాకు భక్తుడై అత్యంత పరాక్రమవంతుడగుు. ఇచటకు వచ్చి నన్ను దర్శించుటతోడనే ఆ చక్రవర్తి సామ్రాట్టు అగును."
ఈ విధంగా గొప్ప గొప్ప లీలలను చేయు ఆ దంపతులు స్వయముగ అచటనే స్థితులైరి. జ్యోతిర్లింగ స్వరూపుడగు మహాదేవుడు అచట నాగేశ్వరుడుగా పిలువబడెను. గౌరీదేవి నాగేశ్వరి నామముతో ఖ్యాతి వహించెను. వారిరువురును సత్పురుషులకు ప్రియమైనవారు. ఆ స్వామి ముల్లోకములయందలి సకల కోరికలను సదా తీర్చుచుండును. ప్రతిదినము భక్తి శ్రద్ధలతో నాగేశ్వర ప్రాదుర్భావ ప్రసంగమును వినెడి బుద్ధిమంతుడగు మానవుని మహాపాతకములు నశించిపోవును. అతని సకల మనోరథములు ఈడేరును.


No comments