Breaking News

గజేంద్ర మోక్షము కథ

పూర్వం ఇంద్రద్యుమ్నుడనే రాజేంద్రుడు ఉండేవాడు. అతడు ఎన్నో దానధర్మాలు చేసి ధర్మాచరణలో తనంతటి వాడు లేడనే ఖ్యాతిని పొందినాడు. లెక్కగట్టలేనన్ని గో భూ హిరణ్య దానములు పాత్రులైన వారికిచ్చి అనంత పుణ్యసంపదను ఆర్జించుకొన్నాడు. రాజర్షి అయ్యి ప్రజారంజకముగా పాలన చేసినాడు. అలా ఎన్నో వర్షములు రాజ్యపాలనము చేసి తన పుణ్యనిధి ప్రభావముతో కాలం చెల్లాక స్వర్గం చేరుకొన్నాడు. చాలాకాలము స్వర్గభోగాలు అనుభవించిన తరువాత ఒకరోజు దేవేంద్రుడు ఇంద్రద్యుమ్నుని పిలిపించి
“మహాత్మా! నీవు అనేక దానధర్మాలు చేసి ఎంతో పుణ్యమును ఆర్జించినావు కనుక ఇంత దీర్ఘకాలము స్వర్గములో ఉండగలిగినావు. కానీ పరమేశ్వరుని శరణువేడి ఆయన కృపతో పోందెడి మోక్షపదము ఒక్కటే శాశ్వతమైనది (ఇతరములు శాశ్వతములు కావు). నీ పుణ్యఫలమును అనుభవించినావు కావున సర్గమును వీడు సమయము వచ్చినది” అని చెప్పినాడు. స్వర్గాధిపతి మాటలు విని ఇంద్రద్యుమ్నుడు ఇంతకొద్ది కాలములోనే తన పుణ్యరాసులు ఎలా కరిగిపోయినాయి? అని ఆశ్చర్యపోయినాడు. అది చూసి శచీపతి “రాజా! భూలోకములో నిన్ను కానీ నీవుచేసిన సత్కర్మలను కానీ గుర్తుపెట్టుకొన్న వానిని నాకు చూపిస్తే నీవు స్వర్గములోనే ఉండవచ్చు. చేసిన దానములు మహనీయములు కాకపోతే జనులు చిరకాలము గుర్తుంచుకొనరు కదా! కావున నీ దానములను ఎంతకాలము ప్రజలు ఉపయోగింతురో అంతకాలము నీవిక్కడనుండవచ్చు” అని హితవు చెప్పినాడు. ఇంద్రుని ఆజ్ఞతీసుకొని అట్టివారు ఉన్నారేమో వెదకటానికి బయలుదేరినాడు ఇంద్రద్యుమ్నుడు.
చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి వద్దకువెళ్ళి నమస్కరించి “ఓ తపస్విచంద్రమా! నన్ను మీరు ఎఱుగుదురా”? అని అడిగినాడు. అప్పటికి ఎంతోకాలముగా తీర్థయాత్రలుచేసి ఉపవాస వ్రతాలు చేసి కృశించి ఉన్న మార్కండేయ మహర్షి గుర్తులేదని చెప్పినాడు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు “స్వామి! చిరంజీవులైన మీకంటే ముందుపుట్టిన ప్రాణి ఏదైనా బ్రతికి ఉన్నదా”? అని అడిగినాడు. “పవిత్ర హిమాలయ పర్వత ప్రాంతములో ప్రావారకర్ణం అనే గుడ్లగూబ ఉన్నది” అని బదులిచ్చినాడు మార్కండేయ మహర్షి.
వెంటనే ఆ ఉలూకము వద్దకు చేరి “అయ్యా! నెన్నెఱుగుదువా”? అని ప్రశ్నించినాడు. తెలియదు అని చెప్పి “ఇక్కడికి కొన్ని యోజనాల దూరములో ఇంద్రద్యుమ్నమను సరోవరమున్నది. ఆ సరోవరములో నాడీజంఘమనే కొంగ ఉన్నది” అని ప్రావారకర్ణం చెప్పగా ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మదేవుని స్నేహితుడైన నాడీజంఘుని వద్దకు చేరి “ఓ బకరాజా! నన్ను మీరు గుర్తుపట్టినారా”? ప్రశ్నించినాడు. “లేదు. ఈ సరోవరములో ఆకూపారమనే తాబేలు ఉన్నది. అది నాకంటే పెద్దది. దానికి నీవు తెలుసేమో కనుక్కో” అని చెప్పినది.
ఇంద్రద్యుమ్నుని చూడగానే ఆకూపార కళ్ళుచెమ్మగిల్లాయి “అయ్యా! వెయ్యి యజ్ఞములు సాంగముగా చేసి వెయ్యి యూపస్తంభాలు కట్టించినావు. ఆ యజ్ఞదానాలలో లెక్కకట్టలేనన్ని గోదానాలు ఇచ్చినావు. నీవు దానము ఇచ్చిన గోవుల రాకపోకలతో ఈ భూమి దిగబడి యింత సరోవరము అయినది. ఇది అంతా నీ చలవే” అని కృతజ్ఞతాపూర్వకముగా చెప్పినది. మరుక్షణం దేవతలు దివ్యవిమానములో ఇంద్రద్యుమ్నుని స్వర్గానికి తీసుకొని వెళ్ళినారు.
ప్రియ భగవత్ బంధువుల్లారా! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:
మన సత్కీర్తి భూలోకములో ఉన్నంత కాలము సర్గలోకము కరతలామలకము. ఆకూపార ఇంద్రద్యుమ్నుడు చేసిన దానములు మరువలేదు కావున ఇంద్రద్యుమ్నునికి పునః సర్గలోక ప్రాప్తి కలిగినది. కానుక మనము నలుగురుకీ ఉపకరించే పనులు చేయాలి. అవియే మనలను రక్షించు సంపదలు (ధనము కాదు).
దేవేంద్రుడు చెప్పినట్టు మోక్షము ఒక్కటే శాశ్వతపదము. ఇంత పుణ్యాత్ముడు కాబట్టే మహావిష్ణువు గజేంద్ర రూపములో ఉన్న ఇంద్రద్యుమ్నునిచే “నీవేతప్ప హితః పరంబెఱుగను …” అని అనిపించి అతనికి శాశ్వతమైన మోక్షమును ప్రసాదించినాడు (గజేంద్ర మోక్షము కథ). కావున మోక్షమునకు పుణ్యమే ప్రథమ సోపానము.


No comments