ఓం గం గణపతయే నమః
పార్వతీదేవి, శ్రీ మహావిష్ణువు అన్నచెల్లెళ్ళు. ఒకసారి శ్రీ మహావిష్ణువు తన భావగారైన శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్ళాడు. వెళ్తూనే తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని, గద మొదలైన ఇతర ఆయుధాలను ఒక పక్కన విడిచిపెట్టాడు. అక్కడే బాలగణపతి ఆడుకుంటున్నాడు. గణపతి చాలా అల్లరివాడు. బంగారు కాంతులతో వెలిగిపోతున్న సుదర్శన చక్రం చట్టుక్కున నోట్లో వేసుకుని, మౌనంగా కూర్చున్నాడు.
మాటల మధ్యలో తన చక్రం గుర్తొచ్చిన విష్ణువు ఎక్కడుందని వెతకడం మొదలుపెట్టాడు. 'ఏం వెతుకుతున్నావు మావయ్యా!' అని గణపతి అనగా, సుదర్శన చక్రాన్ని వెతుకున్నా అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఇంకేక్కడుంది మావయ్యా చక్రం! నేను తినేశాగా అని నవ్వేశాడు గణపతి. విష్ణువుకేమో గణపతి అంటే మహాఇష్టం. గణపతిని ఏమి అనలేడు. అసలే ముద్దుల మేనల్లుడు. అందువల్ల 'బాబ్బాబు! అది రాసక్షులను హడలుగొట్టి, సంహారం చేసే మహాసుదర్శనం, దాన్ని బయటకు విడిచిపెట్టు నాయనా' అని బ్రతిమాలాడు. కానీ వినాయకుడు పట్టువదల్లేదు.
ఇక చేసేది లేక విష్ణువు తన కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుని గణపతి ముందు గుంజీళ్ళు తీశాడు. విష్ణువు చేసే పని గణపతికి విచిత్రంగా అనిపించడమే కాక, విపరీతమైన నవ్వు తెప్పించింది. గణపతి కడుపు నొప్పిచేంతగా నవ్వాడు. ఇలా నవ్వడంలో ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నాడు శ్రీ మహావిష్ణువు.
అప్పటి నుంచి #గణపతి ముందు గుంజీళ్ళు తీసే సంప్రదాయం వచ్చింది. గణపతి ముందు మొట్టమొదట గుంజీళ్ళు తీసింది విష్ణువే. ఈ విధంగా శ్రీమహావిష్ణువు చేత గుంజీళ్ళు తీయించిన గణపతి మనల్ని అనుగ్రహించుగాక.
గణపతి ముందు తీసే గుంజీళ్ళలో ఆరోగ్య రహస్యం కూడా ఉంది. గుంజీళ్ళు తీయడం వల్ల మెదడుకు రక్తప్రసరణ బాగా జరిగి మేధస్సు వృద్ధి చెందుతుంది. దీని మీద జరిగిన ఆధునిక పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. అందుకే ప్రపంచంలో ఈ రోజు గుంజీళ్ళను 'సూపర్ బ్రెయిన్ యోగా'గా చెప్తున్నారు. కావాలంటే ఈ వీడియోను చూడండి. http://www.youtube.com/watch?v=p876UDB8EN4
ఈ కధలో యోగ రహస్యం కూడా ఉంది. గణపతి మూలాధారంలో ఉంటాడు. విష్ణువు విశుద్ధచక్రానికి అధిష్టానదైవం. సుదర్శనం అనగా ఆజ్ఞాచక్రం. ములాధారంలో ఉన్న గణపతి సుదర్శన చక్రాన్ని మ్రింగడం అంటే కుండలిని శక్తి ఆజ్ఞాచక్రాన్ని చేరడమన్నమాట. కుండలిని ఆజ్ఞాచక్రాన్ని చేరితే, ఇక మిగిలేది ఒక్క మెట్టు మాత్రమే. అప్పుడు ఆనందంతో జీవుడు నాట్యం చేస్తాడు. మానవ తత్వానికి, దైవత్వానికి మధ్య నిలిచి ఉంటాడు. కొన్ని సార్లు దైవానుభవాన్ని పొందుతూ, మళ్ళీ మామూలు ప్రపంచంలోకి వస్తుంటాడు. దాన్ని సూచించేదే సర్వవ్యాపుకుడైన విష్ణువు గుంజీళ్ళు తీయడం. గణపతి ముందు రోజు గుంజీళ్ళూ తీస్తూ ఉంటే, ములాధారంలో ఉన్న కుండలినిశక్తి క్రమంగా జాగృతమవుతుంది.
ఓం గం గణపతయే నమః
No comments