కురుక్షేత్ర దర్శనం – స్వామి స్మరణం
1967 సంవత్సరంలో విజయవాడ నుండి వెలువడే ‘ఆంధ్రప్రభ’లో వారం వారం శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి ఉపన్యాసాలు ప్రకటిస్తూండేవారు. మేమా ఉపన్యాసాలు చదువుతూ వచ్చాము.
ఆ తరుణంలో మా కుమార్తె అకాలమరణం, మా రెండవ కుమారుని అనారోగ్యం కారణంగా మా దంపతులకు మనఃశ్శాంతి లేకపోయింది. కుమారుని జాడ్యం ఫలానా అని నిర్ణయించలేక పోయినాము. అందుచేత ఢిల్లీలో ‘ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’లో రోగ నిర్ణయం చేయించు కుందామనుకున్నాము.
ఢిల్లీ వెళ్ళేముందు శ్రీ కంచి శంకరాచార్యుల వారి దర్శనం చేద్దామని మాకు కోరిక కలిగింది. నరసారావుపేట సమీపంలో శ్రీ స్వామి వారిని దర్శించాము. సుమారు 45 నిమిషాలు శ్రీవారితో గడిపాము. వైద్యపరీక్షకై కుమారుని ఢిల్లీ తీసుకు వెళుతున్నామని చెప్పగానే, కురుక్షేత్రం వెళ్ళి దేవుని దర్శించండి అని స్వామివారు ఆదేశించారు. అదేవిధంగా కురుక్షేత్రం పోయి దేవుని దర్శించాము.
ఆ తరువాత ఢిల్లీ ‘మెడికల్ సైన్సెస్’లో పిల్లవాడిని పరీక్ష చేయించాము. మా కుమారునికి ఏ జబ్బు లేదని ఇన్స్టిట్యిట్యూట్ వారు నిర్ణయించారు. కొండంత బరువుతో కుంగిపోతూ, ఢిల్లీకి వెళ్ళిన మాకు ఎంతో మనఃశ్శాంతి కలిగింది. అది మొదలుకొని మా కుమారుడు నేటి వరకు ఆరోగ్యంగా ఉన్నాడు.
మాకు జీవితంలో ఎప్పుడు ఏ సమస్యలు వచ్చినా శ్రీవారి దర్శనం చేస్తాము. వారి దర్శనం వల్ల మాకు కలిగే ఆనందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు.
ఇప్పుడు మేము ప్రతిదినం అధమం ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి అయినా స్వామిని స్మరించకుండా ఉండలేము.
అంతే కాదు, అప్పటి నుండి నేను ఏ రోగికి శస్త్రచికిత్స చేసినా స్వామిని స్మరించి చికిత్స ప్రారంభిస్తాను.
--- డాక్టర్ పిన్నమనేని వేంకటేశ్వర రావు
No comments