Breaking News

శుచౌ దేశే ప్రతిష్ఠాప్ స్థిరమాసనమాత్మనః! నాత్యుచ్ఛిత్రం నాతినీచం చైలాజినకుశోత్తరమ్!!

పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనమును, జింకచర్మమును, వస్త్రమును ఒకదానిపై ఒకటి పరచి, అంత ఎక్కువగా కానీ, తక్కువగా కానీ కాకుండ సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకొనవలెను.

ధ్యానయోగ సాధనకై సహజముగా పరిశుభ్రమైన ప్రదేశమును ఎన్నుకొని, ఊడ్చి, జలశుద్ధితో దానిని నిర్మలముగా సిద్ధము చేసికొనవలయును. దీనికి నదీతీరములు, కొండగుహలు, దేవాలయములు, తీర్థస్థానములు, ఉపవనములు, మొదలగు ప్రదేశములు అనుకూలములు. స్వచ్ఛమైన గాలి లభించు ప్రదేశము పరిశుభ్రముగా, పవిత్రముగా, నిర్జనముగా లభించినచో అట్టిది సాధనకు యోగ్యమైన ప్రదేశము.
సాధకుడు స్థిరముగా కూర్చొనుటకు అనుకూలముగా చెక్కతో గాని, రాతితో గాని చేయబడిన పీటను లేక అరుగును ఆసనము అని యందురు. ఆసనము మిక్కిలి ఎత్తుగానున్నచో ధ్యాన సమయమున ఒకప్పుడైనను క్రిందపడిపోవు ప్రమాదము ఉండును. ఎత్తు మిక్కిలి తక్కువగానున్నచో భూమివలన కలుగు శీతోష్ణముల ప్రభావమున గాని, క్రిమికీటకాదుల వలన గాని ధ్యానమునకు ఆటంకములు ఏర్పడవచ్చును. కావున ఆసనము యొక్క ఎత్తు మిక్కిలి ఎక్కువగాని, తక్కువగాని కాక ఒక ప్రమాణమ్లో ఉండవలెనని తెల్పుటకై నాత్యుచ్ఛ్రితమ్, నాతి నీచమ్ అను విశేషణములు ప్రయోగింపబడినవి.
చెక్క ఆసనము గాని, రాతి ఆసనముగాని కఠినముగా ఉండుట వల్ల కాళ్ళకు బాధ ఏర్పడు అవకాశముండును. కావున దానిపై కుశాసనము, మృగచర్మము, వస్త్రము క్రమముగా ఒకదానిపైనొకటి పరచి, మెత్తగా నుండునట్లు చేయుటకై ’చైలాజిన కుశోత్తరమ్’ అను విశేషణ ప్రయోగం చేయబడినది. మృగచర్మము క్రింద ధర్భాసనమును ఉంచుట వల్ల అది ఎక్కువ కాలము భద్రముగా ఉండును. చర్మముపై వస్త్రమును పరచుటవల్ల అది శరీరమునకు గ్రుచ్చుకొనక మెత్తగా ఉండును. కావున ఈ మూడింటిని పరచవలెనని చెప్పబడినది.

* చర్మము కొరకు జింకలను చంపరాదు. అట్లు చేయుట జీవహింసయగును. అట్టి చర్మము ధ్యానమునకు పనికిరాదు. కనుక సహజముగా మరణించిన జింకల చర్మములనే దీనికి ఉపయోగించవలెను. జింక చర్మము లభింపనిచో ’కంబళి’ ని ఆసనముగా ఉపయోగింపవచ్చును.

No comments