Breaking News

రావణుడు తీసుకుపోయిన సీతమ్మ వున్న చోటు కనిపెట్టడానికి హనుమంతుడు ఆకాశమార్గాన బయలుదేరడానికి సిద్ధపడ్డాడు

రావణుడు తీసుకుపోయిన సీతమ్మ వున్న చోటు కనిపెట్టడానికి హనుమంతుడు ఆకాశమార్గాన బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. ముందుగా అతను సూర్యుణ్ణీ, మహేంద్రుణ్ణీ, వాయువునూ, బ్రహ్మనూ, సర్వభూతాలనూ, దోసిలివొగ్గి ధ్యానించాడు. అ తరువాత తూర్పు మొగంగా వుండి తన తండ్రి అయిన వాయుదేవుణ్ణి ప్రత్యేకంగా ప్రార్థించి, అప్పుడు దక్షిణానికి వెళ్ళాడానికి శరీరం పెంచుకొన్నాడు. వానరులు చూస్తూ వుండగానే పర్వకాలంలో సముద్రంలాగ అతను పెరిగిపోయాడు.

ఇలాగ ఇంత అని చెప్పడానికి వీలులేనంతగా శరీరం పెంచుకొని అతను లంకకేసి తిరిగి చేతులు విసురుకుంటూ పరవళ్ళు తొక్కాడు. దాంతో ఆ మహేంద్రపర్వతం గడగడ వొణికిపోయింది. మహర్షులు కొందరు ఆకాశాన సంచరింప చెయ్యగల అణిమాదిసిద్ధుల శక్తులు చూపిస్తూ ఆకాశాన నిలిచి ఆ పర్వతం చూడసాగారు. భావితాత్ములైన మహర్షులూ, సిద్ధులూ, చారణులూ, ఆకాశాన చేరి ' ఇదిగో, పర్వతం వంటి ఆకారంతో హనుమంతుడు మహావేగంతో సముద్రం దాటుతున్నాడు. రామునికోసమూ, వానరుల కోసమూ దుష్కరమైన పని చెయ్యబూని ఎవరికీ సాధ్యంకాని సముద్రం అవతలి పారం చూడ్డానికి వెడుతున్నాడు' అని చెప్పుకుంటూ వుండగా విని విధ్యాధరులు కూడా అప్రమేయుడైన హనుమంతుణ్ణి చూశారు.

ఉత్సాహోద్రేకం వల్ల అప్పుడు హనుమంతుడు తన రోమాలు విదిల్చాడు. గొప్ప మేఘంలాగా సింహనాదం చేశాడు. అప్పుడు హనుమంతుడు "వానరోత్తములారా! రాముడు విడిచిన బాణం యెలాగ వాయువేగంతో వెడుతుందో, అలాగే నేనిదిగో లంకకు వెడుతున్నాను. నాకు లంకలో సీతమ్మ కనబడకపోతే ఆ తోవనే దేవలోకానికి వెడతాను. అక్కడ కూడా నాకు సీతమ్మ కనబడకపోతే చేతులు కట్టి రాక్షస రాజయిన రావణుణ్ణే తీసుకువచ్చేస్తాను. లంక కూడా పెల్లగించి తెచ్చేస్తాను. ఇలాగ, యెలాగయినా నేను చివరికి సీతమ్మను తీసుకువస్తాను" అని చెప్పి, తాను గరుత్మంతుడే అనుకుంటూ యెగిరాడు.

అంతవడిగా యెగురుతున్న అతని మీద దేవతలూ, గంధర్వులూ, దానవులూ పూలవాన కురిపించారు. అతను రామకార్యం సాధించడానికి వెడుతూ వుండడం వల్ల సూర్యుడు తన తీక్షణ కిరణాలతో తపింప చెయ్యకుండా వూరుకున్నాడు. వాయువు చల్లగా వీచాడు. అతన్ని చూసి మహర్షులూ పొగిడారు. దేవతలూ, గంధర్వులూ గానం చేశారు. నాగులూ, యక్షులూ, రాక్షసులూ, దేవతలూ, పక్షులూ ఎంతమాత్రమూ శ్రమలేకుండా యెగురుతున్న అతన్ని చూసి చాలా సంతోషించారు.

హనుమంతు డలా రామకార్యార్థం యెగిరివెడుతూ వుండడం చూసి ఇక్ష్వాకువంశాభివృద్ధి కోరి సముద్రుడు "ఇప్పుడీ వానరోత్తమునకు నేను సాయం చెయ్యకుండా వూరుకుంటే అందరూ నన్ను నిందిస్తారు. నేను ఇక్ష్వాకువంశీయులలో మహా సమర్థుడైన సగర చక్రవర్తి వల్ల గొప్ప స్థితికి వచ్చాను. ఈ హనుమంతుడు ఇక్ష్వాకువంశీయుడైన రాముని మంత్రి. కనుక, ఇతను ఆయాస పడకూడదు. అంచేత, నే నితనికి విశ్రాంతి లభించేటట్టు చెయ్యాలి. తరువాత యితను తన పని చక్కగా నెరవేర్చుకోగలడు" అని తలచి నీటిలో మునిగివున్న హిరణ్యశృంగుడైన మైనాకుణ్ణి చూసి "పర్వతరాజా! పాతాళంలో వున్న రాక్షసులు పైకి రాకుండా దేవేంద్రుడు నినిక్కడ అడ్డంగా వుంచాడు. కిందికీ, పైకీ, అడ్డంగానూ కూడా పెరగడానికి నీకు శక్తి వుంది. కనుక నువ్విప్పుడు పైకి పెరగాలి. హనుమంతు డిప్పుడు రామకార్యం కోసం నీపై నుంచి వెడుతున్నాడు. ఇక్ష్వాకువంశీయులకు సేవ చేస్తున్నాడు. కనుక, నేనతనికి సాయం చెయ్యాలి. ఇక్ష్వాకువంశీయులు నాకు పూజ్యులు. ఇతను మనకు అథిది మాత్రమే కాదు, పరమ పూజ్యుడున్నూ. నీమీద నిలిచి యితను విశ్రమిస్తాడు. కనుక పైకి లే. నీ శిఖరాలు హిరణ్మయాలు. నిన్ను దేవతలూ గంధర్వులూ సేవిస్తూ వుంటారు. ఇతను నీమీద నిలిచి శ్రమ తీర్చుకొని తరువాత తక్కినపని చేస్తాడు. అదే, హనుమంతుడు వచ్చేస్తున్నాడు అని తొందరపెట్టాడు.

ఇది విని మైనాకుడు చెట్లతోను లతలతోనూ వెంటనే పైకి లేచాడు. ఆ కాంచన శిఖరాల కాంతితో నల్లగా వున్న ఆకాశం అంతా బంగారం పూసినట్టయింది. కాని మైనాకుడు, చూస్తూండగా పైకి విజృంభించడం చూసి, హనుమంతుడు ఇది తనకొక విఘ్నం తటస్థించిందని అనుకొన్నాడు. దీంతో మహావేగంతో యెగురుతున్న హనుమంతుడు తమ రొమ్ముతో తాకి పడగొట్టాడు. మైనాకుడిలా పడిపోయిన్నీ, హనుమంతుని వేగం తెలుసుకున్నీ మిక్కిలీ ఆనందించి, మనుష్యరూపంతో తన శిఖరం మీద నుంచుని "హనుమా! నన్నిలా పడగొట్టడం నీకు తప్ప మరెవ్వరికీ శక్యం కాదు; కనుక, నా శిఖరం మీద వాలి విశ్రమించు. రాముని పూర్వులవల్లనే యీ సముద్రుడింతవాడైనాడు. రామకార్యార్థమై వెడుతున్న నిన్ను పూజిస్తున్నాడు. నీ కోసం యితను ప్రోత్సహించడం వల్లనే నేను పైకి లేచాను. నా మీద నిలిచి కొంచెం సేపు విశ్రమించవయ్యా!.

ఈ హనుమంతుడు నూరామడల సముద్రం దాటబూనుకున్నాడు. ఇక్కడ నీ చరియల మీద విశ్రమించి తతిమా దూరం వెడతాడని సముద్రుడు చెప్పాడయ్యా! కనుక చక్కగా పరిమళిస్తున్న యీ కందమూలఫలాలు ఆరగించు. అతివేగంగా యెగరగల వానరులందరిలోనూ నువ్వు ముఖ్యుడవని నేను తలుస్తున్నాను. దేవతలకందరికీ తలమానికం అయిన వాయుదేవుని కుమారుడవు నువ్వు. అంచేతనే నీకింతటి వేగం వచ్చింది. నిన్ను పూజిస్తే వాయుదేవుణ్ణి పూజించినట్టే. కనుక, నా పూజలు అందుకోవయ్యా! నువ్వు నేనూ సముద్రుడూ ఇచ్చే ఆతిథ్యం స్వీకరించాలయ్యా! అలసట తీర్చుకో. నిన్ను చూడ్డం వల్ల నాకు చాలా ఆనందం కల్గింది" అని అనేక విధాల ప్రార్థించాడు.

హనుమంతుడు "చాలా సంతోషించాను. మీ ఆతిథ్యం నేను స్వీకరించినట్టే. కోపగించుకోకు. నాకు చాలా తొందరపని వుంది. పగలు గడిచిపోతుంది. నే నెక్కడా ఆగకుండా వెళ్ళాలని శపథం పట్టాను; కనుక నేనెక్కడా ఆగకూడదు" అని బదులు చెప్పి, మైనాకుణ్ణి చేత్తో స్పృశించి, ముందుకి వెళ్ళిపోయాడు. మైనాకుడూ, సముద్రుడూ చాలా ఆదరంగా చూసి ఆశీర్వదించి గౌరవించారు. తరువాత సముద్రుణ్ణీ, మైనాకుణ్ణీ విడిచి, తన తండ్రి అయిన వాయువు మర్గాన ప్రవేసించి, వెనక్కి తిరిగి మైనాకుణ్ణి చూస్తూ నిరాలంబమైన ఆకాశాన వెళ్ళిపోయాడు హనుమంతుడు.

ఇలాగ మరొకమాటు దుష్కరమైన పని చేసినందుకు దేవతలూ, సిద్ధులూ అందరూ చాలా మెచ్చుకొన్నారు. మైనాకుడు చేసిన పనికిన్నీ వారానందించారు. ఇంద్రుడు మైనాకుణ్ణి చూసి "మైనాకుడా! నువ్వు చేసిన పనికి చాలా సంతోషించాను. నీ కభయం యిస్తున్నాను. స్వేచ్ఛగా వుండు. నూరామడల సముద్రం దాటుతున్నాడే, మధ్య యితని కేమి అపాయం వస్తుందో అని మేము హడలిపోతున్న సమయాన నువ్వు మంచి సాయం చేశావు. హనుమంతుడు రాముని పని మీద వెడుతున్నాడు. నువ్వతన్ని సత్కతించినందుకు చాలా సంతోషం" అని సగద్గదంగా అన్నాడు. మైనాకుడు దేవేండ్రుడిలా అన్నందుకు చాలా ఆనందించాడు. ఆ వరంతో అతను స్వస్థుడు కాగా, హనుమంతుడున్ను క్షణంలో ముందుకి వెళ్ళిపోయాడు

మహాగ్రంథాలు - శ్రీ రామాయణం



No comments