Breaking News

భక్తిలో వివిధ దశలు

శివానందలహరి లో భగవత్పాదులు భక్తిలోని వివిధ దశలను ఉదాహరణలతో వివరించారు. మొదట్లో భక్తుడు తన మనస్సును బలవంతంగా భగవంతునిపై ఉండేటట్లు చేయాలి. ఆయన పాదాలపై దృష్టిని మోపాలి. ఊడుగు (అంకోల) గింజలు పండిపోయి నేలమీద రాలిపడి మరల వానికవియే చెట్లనంటుకుని పోతాయి. ఇది భక్తిలోని మొదటి దశకు ఉదాహరణ.
భక్తుని మనస్సు భగవంతునిపై నిలబడినప్పుడు భగవంతుని కృప కారణంగా భగవంతునివైపు భక్తుని మనస్సు ఆకర్షింపబడుతుంది. సూదంటురాయి సూదిని ఆకర్షించినట్లు. ఇది రెండవ దశ.
భక్తుని హృదయం పూర్తిగా భగవంతునితో నిండిపోయినప్పుడు, భగవంతుడు కూడా భక్తునిపై ప్రేమను సంపూర్ణంగా ప్రదర్శిస్తాడు. అది పతివ్రత అయిన స్త్రీ తన పతిని అంటిపెట్టుకునియున్నట్లు. అప్పుడు పతి కూడా తన పత్ని పట్ల విపరీతమైన ప్రేమను ప్రదర్శిస్తాడు.
ఇది మూడవ దశగా మనం చెప్పవచ్చు.
నెమ్మదిగా భక్తుడు భగవంతునికి భూషణమవుతాడు. ప్రహ్లాదుడు లేకపోతే నరసింహావతారం ఎత్తి భగవంతుడు ఈ లోకాన్ని ఆశీర్వదించేవాడు కాదు. అలా ఒకవిధంగా భక్తుడు భగవంతుని ప్రఖ్యాతిని పెంచుతాడు. ఒక లత చెట్టును అల్లుకునిపోయి దాని సౌందర్యాన్ని పెంచినట్లుగా ఉంటుందది. ఈ నాల్గవ దశ దాటిన తరువాత భక్తుడు భగవంతునితో మమైక్యమైపోతాడు. నదులు సముద్రంలో విలీనమైపోయినట్లు. ఒకసారి నదులు సముద్రంలో కలిస్తే ఇక వాటికి ప్రత్యేక అస్తిత్వం ఉండదు. సముద్రం నుండి నదులను విడిగా చూడలేము. అలాగే భక్తుడు కూడా భగవంతుని మించి వేరుగా ఉండడు.
" అంకోలం నిజబీజ సంతతిరయస్కాన్తో పలం సూచికా
సాధ్వీ నైజవిభుం లతా క్షితిరుహం సింధు: సరిద్వల్లభమ్ !
ప్రాప్నోతీహ యథాతథా పశుపతే: పాదారవిన్దద్వయం
చేతోవృత్తి రుప్యేత తిష్ఠతి సదా సా భక్తిరిత్యుచ్యతే !!
--శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్ధ మహాస్వామి శ్రీ శారదా పీఠము - శృంగేరి వారి "స్పూర్తినందించే ఆధ్యాత్మిక కధలు" నుండి


No comments